తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తన టెస్ట్ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌తో నితీష్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ తెలుగోడు నిలబెట్టుకున్నాడు.
బ్యాటర్లంతా విఫలమైన వేళ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసి భారత బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37)తో కలిసి నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు.

ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులు చేయగలిగింది. పంత్ ఔటైన తర్వాత మరో ఎండ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి సహకారం లభించలేదు. దాంతో అతను ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్ భారత ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా మారింది.
ప్యాట్ కమిన్స్ వేసిన 48వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని కమిన్స్ బౌన్సర్‌గా సంధించగా.. నితీష్ రెడ్డి సూపర్ అప్పర్ కట్‌తో సిక్సర్ తరలించాడు. థర్డ్ మ్యాన్ పొజిషన్‌లో మార్నస్ లబుషేన్‌ను ఫీల్డ్ సెట్ చేసి మరి కమిన్స్ ఈ బంతి వేసాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి కొట్టిన అప్పర్ కట్.. లబుషేన్ పై నుంచి సిక్సర్‌గా వెళ్లింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సిక్సర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు నితీష్ బ్యాటింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'తెలుగోడి సిక్సర్.. పోలా అదిరిపోలా'అని కామెంట్ చేస్తున్నారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సిక్సర్లే నమోదయ్యాయి. నితీష్ కుమార్ రెడ్డితో పాటు రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో సిక్సర్ కొట్టారు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్(0), దేవదత్ పడిక్కల్(0) డకౌటవ్వగా.. విరాట్ కోహ్లీ(5), ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) తీవ్రంగా నిరాశపరిచారు. థర్డ్ అంపైర్ తప్పిదం కేఎల్ రాహుల్(26) వెనుదిరిగాడు. పంత్, నితీష్ కుమార్ రెడ్డి 48 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 150 పరుగుల మార్క్ అందుకోగలిగింది.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు తీసాడు. హర్షిత్ రాణాకు ఓ వికెట్ దక్కింది. బుమ్రా ధాటికి స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్‌స్వీనీ(10) పెవిలియన్ చేరగా.. మిచెల్ మార్ష్(6), మార్నస్ లబుషేన్(2)లను సిరాజ్ ఔట్ చేశాడు. ట్రావిస్ హెడ్(11)ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో అలెక్స్ క్యారీ(8 బ్యాటింగ్)తో పాటు ప్యాట్ కమిన్స్(0 బ్యాటింగ్) ఉన్నారు.