ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌పై మహమ్మద్ సిరాజ్ మరోసారి విరుచుకుపడ్డాడు. ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడని, అతను తన బౌలింగ్‌ను మెచ్చుకోలేదని స్పష్టం చేశాడు. టీవీ రిప్లేలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే.
వన్డే తరహా బ్యాటింగ్‌తో 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140 పరుగులు చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ట్రావిస్ హెడ్‌ను మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఆగ్రహంగా సంబరాలు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ నోటికి పనిచెప్పాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్.. 'ఛల్ పో బే.. పో'అన్నట్లు సైగ చేశాడు.

ఈ ఘటన తీవ్ర వివాదస్పదమైంది. ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో సిరాజ్ విలన్‌గా మారాడు. దాంతో వారు మ్యాచ్ అసాంతం సిరాజ్‌ను గేలి చేశారు. మరోవైపు సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం సిరాజ్ తీరును తప్పుబట్టారు. రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదాస్పద ఘటనపై ట్రావిస్ హెడ్ స్పందించాడు. తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని, అతను మాత్రం అపార్థం చేసుకున్నాడని తెలిపాడు. సిరాజ్ రియాక్షన్ తనకు నచ్చలేదన్నాడు. దాంతో సిరాజ్‌పై భారత అభిమానులు కూడా ట్రోలింగ్ దిగారు.
తాజాగా ట్రావిస్ హెడ్ వ్యాఖ్యలపై సిరాజ్.. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ట్రావిస్ హెడ్ అబద్దాలు చెప్పాడని స్పష్టం చేశాడు. 'ట్రావిస్ హెడ్‌కు బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదించాను. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మా మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మంచి బంతికి బ్యాటర్ సిక్స్ కొడితే ఏ బౌలర్‌కైనా బాధగా ఉంటుంది. అది నాలో కసిని పెంచింది. ఆ వెంటనే నేను అతన్ని ఔట్ చేసి సంబరాలు చేసుకున్నా. ట్రావిస్ హెడ్ మాత్రం నా సంబరాలను తట్టుకోలేక తిట్టాడు. టీవీ రిప్లేలు చూస్తే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రారంభంలో నేను సంబరాలు మాత్రమే చేసుకున్నాను.
ట్రావిస్ హెడ్‌ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రావిస్ హెడ్ తప్పుగా చెప్పాడు. బాగా బౌలింగ్ చేశావ్ అని మెచ్చుకున్నానని అబద్దాలు ఆడాడు. అలా అతను అనలేదు. మేం పత్రీ ఒక్కరిని గౌరవిస్తాను. మరీ ముఖ్యంగా నేను అందరీతో మర్యాదగా నడుచుకుంటాను. ఎందుకంటే క్రికెట్ జెంటిల్‌మన్ గేమ్. ట్రావిస్ హెడ్ తీరు వల్ల నేను బాధపడ్డాను.'అని సిరాజ్ వివరణ ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులే చేసింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 148 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.
INTERVIEW OF MOHAMMED SIRAJ...!!!!
— Johns. (@CricCrazyJohns) December 8, 2024
- Siraj confirms "Travis Head didn't say well bowled". pic.twitter.com/CXrRdDuLcX