ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియాకు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్లు మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42) నిప్పులు చెరిగారు. దాంతో 9/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది.
బ్యూ వెబ్‌స్టర్(105 బంతుల్లో 5 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(57 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42)లతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా(2/33), నితీష్ కుమార్ రెడ్డి(2/32) రెండేసి వికెట్లు పడగొట్టారు. గాయంతో బుమ్రా మధ్యలోనే వెనుదిరిగినా.. సిరాజ్, ప్రసిధ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు.

జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో విరాట్ కోహ్లీ టీమిండియాకు సారథ్యం వహించాడు. అద్భుతమైన సారథ్యంతో ఆసీస్‌ను కట్టడి చేశాడు. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్‌తో కోహ్లీ ఆకట్టుకున్నాడు.
దెబ్బతీసిన సిరాజ్..
రెండో రోజు ఆట ఆరంభంలోనే మార్నస్ లబుషేన్(2)ను బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌటివ్వగా.. భారత్ రివ్యూ సాయంతో ఈ వికెట్ సాధించింది. క్రీజులోకి వచ్చిన స్మిత్.. కొన్‌స్టాస్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. అయితే సిరాజ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.
12వ ఓవర్ రెండో బంతికి సామ్ కొన్‌స్టాస్(23)ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. ఐదోబంతికి డేంజరస్ ట్రావిస్ హెడ్‌ను స్లిప్ క్యాచ్‌గానే బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన బ్యూ వెబ్‌స్టర్ సాయంతో స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఓపికగా ఆడిన ఈ జోడి క్రీజులో సెట్ అయ్యే ప్రయత్నం చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న స్మిత్‌ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆసీస్ 101/5 స్కోరర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
బుమ్రా వైదొలిగినా..
రెండో సెషన్‌లో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా.. అనంతరం మైదానం వీడాడు. టీమ్ డాక్టర్స్‌తో కలిసి స్కానింగ్‌కు వెళ్లాడు. అయితే బుమ్రా గాయంపై మాత్రం క్లారిటీ లేదు. బుమ్రా గైర్హాజరీలో కోహ్లీ టీమ్‌ను నడిపించాడు. అలెక్స్ క్యారీతో కలిసి వెబ్‌స్టార్ ఆచితూచి ఆడాడు. అయితే అలెక్స్ క్యారీని ప్రసిధ్ కృష్ణ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కాసేపు ఆడగా.. అతన్ని నితీష్ రెడ్డి ఔట్ చేశాడు. మరోవైపు వెబ్‌స్టర్ 92 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ స్టార్క్‌ను నితీష్ ఔట్ చేయగా.. వెబ్‌స్టర్‌ను ప్రసిధ్ పెవిలియన్ చేర్చాడు. స్కాట్ బోలాండ్‌ను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
భారత్ 185 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్(4/31) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్(2/37) రెండు వికెట్లు తీసాడు. నాథన్ లయన్‌కు ఓ వికెట్ దక్కింది.