టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో ఈ ఇద్దరూ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించి ఐసీసీ నియామవళిని ఉల్లంఘించిన విషయం తెలిసిందే.
దాంతో ఐసీసీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంది. మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ.. ట్రావిస్ హెడ్ మందలించింది. గత 24 నెలల్లో తొలి తప్పిదం కావడంతో ఇద్దరికి ఒక్కో డీ-మెరిట్ పాయింట్ కేటాయించింది.

అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన సిరాజ్.. ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. దాంతో సహనం కోల్పోయిన ట్రావిస్ హెడ్ అసభ్య పదజాలం ఉపయోగించగా.. సిరాజ్ 'ఛల్ పో బే.. పో'అన్నట్లు సైగలు చేశాడు.
ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమవ్వగా.. మాజీ క్రికెటర్లు సిరాజ్‌ను తప్పుబట్టారు. అయితే ఈ గొడవలో ఇద్దరిది తప్పు ఉందని, అభ్యంతకరమైన పదజాలం, అసభ్య సైగలు చేశారని ఐసీసీ పేర్కొంది. తమ తప్పిదాలను ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
'సిరాజ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5ని ఉల్లంఘించాడు. ఈ రూల్ ప్రకారం ఆటగాళ్లతో పాటు ఆటగాళ్ల సపోర్ట్ స్టాఫ్‌ను అసభ్యకర పదజాలంతో దూషించడం, సైగలు చేయడం, ఆగ్రహంతో కూడిన రియాక్షన్ ఇవ్వడం తప్పిదం. దాంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నాం.
ట్రావిస్ హెడ్ ఆర్టికల్ 2.13ని ఉల్లంఘించాడు. ఈ నియమం ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు, వారి సహాయక సిబ్బంది, అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను తిట్టడం నేరం. దాంతో అతన్ని మందలించాం. గత రెండేళ్లలో తొలి తప్పిదం కావడంతో ఇద్దరికీ చెరో డీ-మెరిట్ పాయింట్ కేటాయించాం. ఇద్దరు ఆటగాళ్లు తమ తప్పిదాలను మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించారు.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.
ఈ పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.