ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 265 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో దుబాయ్ వేదికగా ఇదే భారీ స్కోర్ కావడం విశేషం. స్లోగా ఉన్న వికెట్‌పై ఈ లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు.
హెడ్ దూకుడు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ కూపర్ కొన్నోల్లీ(0)ని మహమ్మద్ షమీ డకౌట్ చేశాడు. బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌తో కలిసి ట్రావిస్ హెడ్ చెలరేగాడు. హార్దిక్ పాండ్యా, షమీ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో డేంజరస్‌గా మారిన ట్రావిస్ హెడ్‌ను రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తీతో కట్టడి చేశాడు. అతను వేసిన తొలి బంతికే ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చెలరేగిన స్మిత్..
క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌తో స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. స్మిత్ మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్‌లో స్మిత్‌కు వరుసగా రెండు లైఫ్‌లు లభించాయి. ఒక రనౌట్ ఛాన్స్ చేజారడంతో పాటు.. బంతి వికెట్లకు తాకినా బెయిల్ కిందపడలేదు. 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్‌ను షమీ అందుకోలేకపోయాడు. ఈ మూడు అవకాశాలతో చెలరేగిన అతను 68 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో లబుషేన్ సైతం ఆచితూచి ఆడటంతో మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీసాడు. లబుషేన్(29)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
క్యారీ హాఫ్ సెంచరీ..
ఆ కాసేపటికే జోష్ ఇంగ్లీస్(11)ను కూడా అతనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ క్యారీ.. స్మిత్‌కు అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్ షాట్లతో బౌండరీలు రాబట్టారు. ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ శర్మ బౌలర్లందరిని ప్రయోగించాడు. చివరకు షమీ.. ఫుల్‌టాస్‌తో స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఐదో వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్(5)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ ద్వార్షుయిస్ సాయంతో అలెక్స్ క్యారీ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే దూకుడు కనబర్చిన బెన్ ద్వార్షుయిస్(19)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. ఆడమ్ జంపా రివ్యూతో బచాయించగా.. అలెక్స్ క్యారీ శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో రనౌట్ అయ్యాడు. చివర్లో నాథన్ ఎల్లిస్(10) ఓ భారీ సిక్సర్‌తో విలువైన పరుగులు చేశాడు. ఆఖరి వికెట్‌గా ఆడమ్ జంపా పెవిలియన్ చేరాడు.