
ముంబై: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా పేసర్లు మహమ్మద్ సిరాజ్(3/29), మహమ్మద్ షమీ(3/17) దుమ్మరేపారు. దాంతో ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో భారత్ ముందు 189 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. భారత బౌలర్లపై అతను ఎదురుదాడికి దిగడంతో ఆసీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడదీసాడు. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో స్మిత్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఇక స్మిత్ ఔటైనా.. లబుషేన్‌తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను పరుగెత్తించాడు. ఈ క్రమంలో 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్.. మరింత ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ అతని జోరుకు రవీంద్ర జడేజా బ్రేక్ వేసాడు. ఊరించే బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మిచెల్ మార్ష్ వికెట్‌తో ఆసీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్(15) జడేజా స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరగ్గా.. జోష్ ఇంగ్లీస్(12), కామెరూన్ గ్రీన్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(8)ను జడేజా బౌల్డ్ చేయగా.. మార్కస్ స్టోయినీస్‌ను షమీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. చివరి రెండు వికెట్లు అయిన సీన్ అబాట్(0), ఆడమ్ జంపా(0)లను మహమ్మద్ సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.