టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను క్రీజులో ఉండి ఉంటే సిరాజ్‌ను దగ్గరకు కూడా రాణిచ్చేవాడిని కాదని, అక్కడి నుంచి వెళ్లిపోమని గట్టిగా చెప్పేవాడినన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్, సిరాజ్ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
లబుషేన్ క్రీజులో ఉండగా.. సిరాజ్ వికెట్ బెయిల్స్ మార్చాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిరాజ్ మార్చిన బెయిల్స్‌ను వెంటనే లబుషేన్ సరిచేశాడు. కానీ ఆ కాసేపటికే అతను నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. టెస్ట్ క్రికెట్‌లో వికెట్లు పడనప్పుడు ఇలా బెయిల్స్ మారిస్తే వికెట్లు దక్కుతాయని బౌలర్లు నమ్ముతారు.

ఈ క్రమంలోనే స్మిత్-లబుషేన్ జిడ్డు బ్యాటింగ్‌తో సతాయిస్తుండటంతో సిరాజ్.. బౌలింగ్ చేసే క్రమంలో బెయిల్స్ మార్చాడు. ఈ ఘటనను మాథ్యూ హెడెన్ తప్పుబట్టాడు. ముఖ్యంగా బెయిల్స్ మారుస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయిన లబుషేన్‌కు చివాట్లు పెట్టాడు.
'లబుషేన్ 55 బంతులు ఆడి కూడా క్రీజులో నిలబడలేకపోయాడు. నేనే లబుషేన్ స్తానంలో ఉండి.. సిరాజ్ బెయిల్స్ మారిస్తే మాత్రం అస్సలు అంగీకరించేవాడిని కాదు. అసలు అతన్ని నా దగ్గరికే రాణించేవాడని కాదు. బౌలర్ ఎవరా? అనేది కూడా పట్టించుకునేవాడిని కాదు.
సిరాజ్ ఏం చేస్తున్నాడో గమనించేవాడిని. బెయిల్స్ మార్చేందుకు అతను నా దగ్గరకు వస్తేనే గెట్ ఔట్ అనేవాడిని.'అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ 55 బంతుల్లో 12 పరుగులే చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ సిరీస్ రెండో టెస్ట్‌లోనూ సిరాజ్, లబుషేన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సైట్ స్క్రీన్‌కు అడ్డు వచ్చారని చివరి నిమిషంలో బంతిని ఆడేందుకు మార్నస్ లబుషేన్ నిరాకరించగా.. సహనం కోల్పోయిన సిరాజ్ ఆగ్రహంగా బంతిని వికెట్ల వైపు విసిరాడు. తాజా టెస్ట్‌లో బెయిల్స్ మార్చి రెచ్చగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో బెయిల్స్ మార్చడం సర్వసాధారణం. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ స్టువర్ట్ బ్రాడ్ ఇలానే బెయిల్స్ మార్చగా.. మరుసటి బంతికే లబుషేన్ ఔటయ్యాడు. గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇలా బెయిల్స్ మార్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101), ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152) సెంచరీలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ(88 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(6/76) ఆరు వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్(2/97) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. వర్షం అంతరాయం కలిగించే సమయానికి 14.1 ఓవర్లలో 4 వికెట్లకు 48 పరుగులు చేసింది. మరోసారి టీమిండియా టాప్-4 బ్యాటర్లు యశస్వి జైస్వాల్(4), శుభ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(3), రిషభ్ పంత్(9) దారుణంగా విఫలమవ్వగా.. కేఎల్ రాహుల్(30 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు.