బ్యాటింగ్ స్థానంపై ఆలోచించడం లేదని, తుది జట్టులో అవకాశం దక్కితే చాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య ఆసీస్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పరిస్థితుల్లో 70కి పైగా బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులతో రాణించాడు.

కాన్‌బెరా వేదికగా ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. దాంతో అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఓపెనర్‌గా ఎవరు? ఆడుతారా? అనేది సందేహంగా మారింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్‌ను ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నాకు తుది జట్టులో చోటు దక్కడమే ముఖ్యం. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడుతా. ఓపెనర్‌గా అయినా.. మిడిలార్డర్‌లో ఆడినా జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బంది పడేవాడిని. తొలి 20-25 బంతులు కష్టంగా అనిపించేది.
ఇప్పటికీ చాలా సార్లు నేను టెస్ట్‌ల్లో.. వన్డేల్లో విభిన్నమైన స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. దాంతో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఆడాలో నాకు క్లారిటీ ఉంది. తొలి 30-40 బంతులు ఆడగలిగితే.. నా శైలిలో బ్యాటింగ్ చేయడం సులువవుతోంది.
నేను పరిస్థితులను అందిపుచ్చుకొని పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. నా బ్యాటింగ్ పొజిషన్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ నాకు క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు నా బ్యాటింగ్ స్థానం ఏంటో చెప్పలేను. మీరు తొలి రోజు ఆట వరకు ఆగాల్సిందే. రేపు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశానికి వస్తాడు.'అని కేఎల్ రాహుల్ తెలిపాడు.