IND vs AUS: టీమిండియాకు శనిలా దాపురించాడు.. కేఎల్ రాహుల్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

నాగ్‌పూర్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతను శుభారంభం అందుకోలేకపోయాడు. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓవైపు కెప్టెన్ రోహిత్ శర్మ భారీ షాట్లతో స్వేచ్చగా ఆడుతుంటే మరోవైపు రాహుల్ తీవ్రంగా తడబడ్డాడు. తీవ్ర ఒత్తిడిలో కనిపించిన రాహుల్ పూర్తిగా డిఫెన్స్ మోడ్‌లోనే ఆడాడు. 71 బంతుల్లో ఒకే ఒక బౌండరీ బాదిన అతను చివరకు అరంగేట్ర ఆసీస్ స్పిన్నర్ ముర్ఫీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో కేఎల్ రాహుల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే.. ఘోరంగా విఫలమయ్యాడని ట్రోల్ చేస్తున్నారు. రాహుల్‌కు బదులు గిల్‌ను ఆడించినా.. టీమిండియాకు ఉపయోగం ఉండేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగ్‌పూర్ పిచ్‌లో బంతి కొత్తగా ఉన్నప్పుడే పరుగులు చేయడం సులువని, పాతబడే కొద్ది స్పిన్నర్లు చెలరేగుతారని, ఆసీస్ ఇన్నింగ్స్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. రాహుల్ మాత్రం తన జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియాకు నష్టం చేశాడని, రోహిత్‌లా అతను కూడా అటాకింగ్ గేమ్ ఆడి ఉంటే టీమిండియా సులువుగా 100 పరుగులు చేసేదని కామెంట్ చేస్తున్నారు.
టీమిండియాకు శనిలా దాపురించాడు..
కొందరైతే కేఎల్ రాహుల్ టీమిండియాకు శనిలా దాపురించాడని ఘాటుగా విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే టీమిండియా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో ఓటమిపాలైందని, అయినా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు బుద్ది రావడం లేదని మండిపడుతున్నారు. రాహుల్ కోసం ప్రతిభ కలిగిన ఆటగాళ్లను పక్కనపెడుతున్నారని, వరుసగా అతనికి అవకాశాలు ఎందుకు ఇస్తున్నారో తమకు అర్థం కావడం లేదంటున్నారు. వైస్ కెప్టెన్ హోదాలోనే రాహుల్ జట్టులో కొనసాగుతున్నాడని, లేకుంటే ఎప్పుడో బయటకు పంపించేవారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి అయినా రాత మారలేదు..
ఈ సిరీస్‌కు ముందే తన గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న రాహుల్.. కనీసం హనీ మూన్‌కు కూడా వెళ్లకుండా టీమిండియాతో చేరాడు. పెళ్లి అయిన రెండు రోజులకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బ్యాట్ పట్టాడు. పెళ్లి అయినా.. రాహుల్ రాత మారలేదని, వెంటనే అతన్ని జట్టులో నుంచి తీసేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దేశవాళీ క్రికెట్ ఆడి మళ్లీ లయ అందుకున్న తర్వాతనే జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచిస్తున్నారు. హర్భజన్ సింగ్, రవిశాస్త్రి వంటి ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్‌నే ఓపెనర్‌గా ఆడించాలని సూచించినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు.
ఆసీస్‌ను ఆడుకున్న భారత్..
తొలి రోజు ఆటలో ఆసీస్‌ను భారత్ ఆడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. రవీంద్ర జడేజా(5/47), రవిచంద్రన్ అశ్విన్(3/42) సత్తా చాటడంతో 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), పీటర్ హ్యాండ్‌స్కోంబ్(84 బంతుల్లో 4 ఫోర్లతో 31), అలెక్స్ క్యారీ(33 బంతుల్లో 7 ఫోర్లతో 36) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో రోహిత్‌తో అశ్విన్(0) క్రీజులో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications