టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మీడియా సమావేశంలో నవ్వులు పూయించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా తడబడుతోంది. ముందుగా బౌలింగ్ బుమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. బ్యాటింగ్‌లో టాప్-4 బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లకు 51 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో కేఎల్ రాహుల్(33 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(0 బ్యాటింగ్) ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
మూడో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న బుమ్రాను ఓ రిపోర్టర్ బ్యాటింగ్ గురించి ప్రశ్నించాడు. 'బుమ్రా.. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సరైన వ్యక్తి మీరు కానప్పటికీ.. గబ్బా పరిస్థితులు బ్యాటింగ్‌కు ఎలా ఉన్నాయి. భారత జట్టు బ్యాటింగ్ గురించి ఏం చెబుతారు?'అని సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు.

'ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. కానీ మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్‌ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరో గూగుల్‌ను అడగండి. జోక్‌ను పక్కనపెడితే.. ఇది మరో స్టోరీ.'అని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ బుమ్రా పేరిటే ఉంది. 2022లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో బుమ్రా (4, 4wd,6nb, 4, 4, 4, 6, 1) 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో పాటు ఓ సింగిల్ తీసాడు. ఇందులో ఒక నోబాల్‌తో పాటు వైడ్ ఫోర్ ఉంది. టెస్ట్ క్రికెట్‌లోనే అత్యధిక ఖరీదైన ఓవర్‌గా ఇది నిలిచింది.