టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో తాత్కలిక సారథిగా టీమిండియాను నడిపిస్తున్న బుమ్రా.. బౌలింగ్‌లో దుమ్మురేపాడు. తనదైన బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నడ్డి విరిచాడు.
బుమ్రా ధాటికి ఆస్ట్రేలియా 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌ను ఆడలేక ఆస్ట్రేలియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఉస్మాన్ ఖావాజా(8), నాథమ్ మెక్‌స్వీనే(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) ఔటయ్యారు. స్టీవ్ స్మిత్ అయితే బుమ్రా స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. బుమ్రా వేసిన ఏడో ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ నాలుగో బంతికి ఖవాజాను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. మరుసటి బంతికి స్మిత్‌ను ఔట్ చేశాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేసిన బంతి లోపలికి దూసుకొచ్చింది. డిఫెన్స్ చేసేందుకు స్మిత్ ప్రయత్నించగా.. బంతి తక్కువ ఎత్తులో రావడంతో వికెట్ల ముందు దొరికిపోయాడు. రిప్లేలో బంతికి స్మిత్ బ్యాట్‌కు చాలా దూరం ఉన్నట్లు కనిపించింది. బుమ్రా స్టన్నింగ్ డెలివరీకి స్మిత్ నోరెళ్లబెట్టాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులే చేసింది. క్రీజులో మిచెల్ స్టార్క్(6 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా(4/17) నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా(1/33)కు ఓ వికెట్ దక్కింది.