ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ప్రారంభించింది. పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌తో టీమిండియాను దెబ్బతీయాలనుకున్న ఆసీస్ వ్యూహం బెడిసి కొట్టింది.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్లు అయ్యింది ఆసీస్ పరిస్థితి. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన భారత్‌ను 150 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది.

నిప్పులు చెరిగిన బుమ్రా..
కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా(4/17), మహమ్మద్ సిరాజ్(2/17), హర్షిత్ రాణా(1/33) నిప్పులు చెరగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులే చేసింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆట మరికాసేపు జరిగి ఉంటే ఆలౌటయ్యేవారు.
బుమ్రా ధాటికి ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) పెవిలియన్ చేరగా.. మార్నస్ లబుషేన్(2), మిచెల్ మార్ష్(6)లను సిరాజ్ ఔట్ చేశాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్(6)ను అరంగేట్ర పేసర్ హర్షిత్ రానా క్లీన్ బౌల్డ్ చేశాడు.
50 ప్లస్ లీడ్ సాధిస్తే..
క్రీజులో మిచెల్ స్టార్క్(6 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) ఉన్నాడు. ఆసీస్ ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్ ఆలౌట్ చేసి భారత్ 50 పరుగుల ఆధిక్యం సాధిస్తే.. ఈ మ్యాచ్‌పై పట్టుబిగుస్తోంది. శనివారం జరిగే ఆటే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు.