IND vs AUS Womens Test: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. పూజా వస్త్రాకర్(4/53), స్నేహ్ రాణా(3/56), దీప్తి శర్మ(2/45) సత్తా చాటడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు కుప్పకూలింది.
తహిలా మెక్‌గ్రాత్(56 బంతుల్లో 8 ఫోర్లతో 50) ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించగా.. బెత్ మూనీ(94 బంతుల్లో 2 ఫోర్లతో 40), అలీసా హీలీ(75 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38) పర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి 98 పరుగులు చేసింది.

షెఫాలీ వర్మ(59 బంతుల్లో 8 ఫోర్లతో 40) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. స్మృతి మంధాన(49 బంతుల్లో 8 ఫోర్లతో 43 నాటౌట్) అద్భుత ప్రదర్శన కనబర్చింది. స్మృతి మంధానతో పాటు స్నేహ్ రాణా(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జెస్ జోనాసెన్‌కు ఓ వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. జెమీమా సూపర్ త్రోకు ఓపెనర్ ఫోబ్ లిట్చ్‌ఫీల్డ్(0) రనౌట్‌గా వెనుదిరిగి డైమండ్ డక్ అయ్యింది. ఆ వెంటనే ఎల్లిస్ పెర్రీని(4) పూజా వస్త్రాకర్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ పరిస్థితుల్లో బెత్ మూనీ, తహిళా మెక్‌గ్రాత్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలింది.
ఈ క్రమంలోనే తహిళా మెక్‌గ్రాత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం మెక్‌గ్రాత్‌ను దీప్తి శర్మ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ వెంటనే బెత్త మూనీ(4) పూజా వస్త్రాకర్ ఔట్ చేయడంతో వెనువెంటనే ఆసీస్ వికెట్లు కోల్పోయింది.
ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన అలిస్సా హీలీ(38)ని దీప్తి శర్మ ఔట్ చేయగా.. అన్నబెల్ సదర్లాండ్‌ను వస్త్రాకర్ ఔట్ చేయడంతో 159 పరుగులకే ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. అశ్లీ గార్డ్‌నర్(11), జెస్ జొనాస్సెన్(19), అలన్ కింగ్(5), లౌరెన్ చీట్లే(6) వరుసగా ఔటవ్వగా. కిమ్ గార్త్ (28 నాటౌట్) కీలక పరుగులు చేయడంతో ఆసీస్ 200 పరుగుల మార్క్‌ను అందుకోగలిగింది.