
నాగ్‌పూర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా అదరగొట్టారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(5/37) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. జడేజా(2/34), మహమ్మద్ షమీ(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు 321/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 139.3 ఓవర్లలో 400 పరుగులకు ముగించింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 84) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.టెయిలెండర్ మహమ్మద్ షమీ(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) విలువైన పరుగులతో భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్ ఓ వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అశ్విన్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. అతనికి జడేజా కూడా తోడవ్వడంతో ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(5), డేవిడ్ వార్నర్(10), మార్నస్ లబుషేన్(17), మ్యాట్ రేన్‌షా(2), పీటర్ హ్యాండ్‌స్కోంబ్(6), అలెక్స్ క్యారీ(10), ప్యాట్ కమిన్స్(1), టాడ్ మర్ఫీ(2) వరుసగా పెవిలియన్ చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మిత్(25 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. కానీ అతనికి మరో ఎండ్‌లో సహకారం అందలేదు. అయితే జడేజా బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా స్మిత్ క్లీన్ బౌల్డ్ అయినా.. నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. అయితే బోలాండ్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన షమీ భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 400 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 91 ఆలౌట్