మొహాలీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది.
డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లకు తోడుగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74)తో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.., పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.

277 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో 142 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
37 బంతుల్లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేయగా.. 60 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీల దిశగా దూసుకెళ్తున్న ఈ ఇద్దర్నీ ఆడమ్ జంపా వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు.
ముందుగా రుతురాజ్ గైక్వాడ్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన జంపా.. శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(3) రనౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్(18) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 185 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కీలక భాగస్వామ్యం అందించారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. సూర్య ఔటైనా.. రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.