ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఘోర పరాజయంతో ముగించింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో కైవసం చేసుకుంది. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ చేరింది.
162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(45 బంతుల్లో 4 ఫోర్లతో 41)రాణించగా.. ట్రావిస్ హెడ్(38 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్(34 బంతుల్లో 6 ఫోర్లతో 39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

కొంపముంచిన బుమ్రా గాయం..
భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు. గాయంతో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది.
అంతకుముందు 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ 157 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్(6/45) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమిన్స్(3/44) మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యూ వెబ్‌స్టర్ ఒక వికెట్ తీసాడు.
నిరాశపర్చిన జడేజా, సుందర్..
ఎన్నో అంచనాలతో మూడో రోజు ఆట ప్రారంభించిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తీవ్రంగా నిరాశపరిచారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 6 పరుగులు మాత్రమే జోడించారు. ఈ ఇద్దర్నీ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. జడేజా(13)ను క్యాచ్ ఔట్ చేసిన కమిన్స్.. సుందర్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మహమ్మద్ సిరాజ్(4), జస్‌ప్రిత్ బుమ్రా(0)లను ఒకే ఓవర్‌లో బోలాండ్ ఔట్ చేయడంతో భారత రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఆసీస్ జోరు..
లక్ష్యచేధనకు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు సామ్ కోన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. ప్రసిధ్ కృష్ణ సామ్ కోన్‌స్టాస్(22), మార్నస్ లబుషేన్(6), స్టీవ్ స్మిత్(4)లను ఔట్ చేసి ఆశలు రేకెత్తించాడు. దాంతో ఆసీస్ 71/3 స్కోర్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్‌లో ఖవాజా మరింత దూకుడుగా ఆడాడు. ట్రావిస్ హెడ్ కూడా బౌండరీలు బాదడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఉస్మాన్ ఖవాజా(41)ను సిరాజ్ ఔట్ చేసినా.. ట్రావిస్ హెడ్‌తో కలిసి బ్యూ వెబ్‌స్టర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
భారత్ 185.. ఆసీస్ 181
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం దక్కినా భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేయలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం ఈ సిరీస్‌లో టీమిండియా కొంపముంచింది.