IND vs AUS: ఏడేసిన జడేజా.. ఫస్ట్ సెషన్‌లోనే ఆసీస్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 115

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేస్తే టీమిండియాకు విజయం దక్కనుంది. రవీంద్ర జడేజా(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌కు అశ్విన్ (3/59) మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్‌లోనే ముగిసింది. 61/1 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్(45), మార్నస్ లబుషేన్(35) రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
గింగిరాలు తిరిగిన పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు అటాకింగ్‌గా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ 1 పరుగు ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం నమోదైంది.

దెబ్బతీసిన అశ్విన్..
మూడో రోజు ఆట ప్రారంభంలోనే ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్‌ను అశ్విన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే డేంజరస్ స్మిత్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆసీస్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.
స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్మిత్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వికెట్‌తో ఆసీస్ పతనం మొదలైంది. జడేజా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ లెగ్ ఫీల్డర్ శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు. కానీ జడేజా లబుషేన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి అతని ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

11 బంతుల్లో 4 వికెట్లు..
లబుషేన్ వికెట్‌తో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. అశ్విన్, జడేజా పోటాపడి వికెట్లు తీయడంతో 11 బంతుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 95 పరుగుల వద్దనే ఈ నాలుగు వికెట్లను కోల్పోవడం మరో విశేషం.
వార్నర్ స్థానంలో కంకషన్‌గా వచ్చిన మాథ్యూ రేన్‌షాన్(2)ను అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. పీటర్ హ్యాండ్‌స్కోంబ్(0)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ(7), ప్యాట్ కమిన్స్(0)లను జడేజా వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు.

జడేజా ఐదు వికెట్లు..
ఈ వికెట్‌తో జడేజా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నాథన్ లయన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. జడేజా అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత మాథ్యూ కుహ్నేమన్(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా.. టీమిండియా 262 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా గట్టెక్కింది.

సంక్షిప్త స్కోర్లు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 113 ఆలౌట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications