ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బౌలింగ్ ప్రదర్శనపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ ప్రణాళికలను భారత జట్టు సమర్థవంతంగా అమలు చేయలేకపోయిందన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి మద్దతు కరువైందన్నాడు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 18 ఫోర్లతో 152), స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101)ను త్వరగా ఔట్ చేయలేకపోయారు. దాంతో ఈ ఇద్దరూ బ్యాటర్లు శతకాలతో చెలరేగి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజులో అలెక్స్ క్యారీ(45 బ్యాటింగ్), మిచెల్ స్టార్క్ ఉన్నారు.

రెండో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మోర్నీ మోర్కెల్.. టీమిండియా బౌలింగ్ ప్రణాళికలకు తగ్గట్లు లేదని చెప్పాడు. దాంతోనే భారత బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు.
'ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేశాడు. అతని వల్లే ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 50-80 ఓవర్ల మధ్య మా బౌలర్లు విఫలమయ్యారు. ధారళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ సమస్యను మేం అధిగమించుకోవాల్సి ఉంది. స్టీవ్ స్మిత్ క్రీజులో సెట్ అయితే పరుగులు చేస్తాడనే విషయం మాకు తెలుసు.
భారీ భాగస్వామ్యంతో మా బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందనే సూచనల నేపథ్యంలోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. సరైన ప్రదేశంలో బంతిని హిట్ చేస్తే వికెట్లు తీయవచ్చని భావించాం. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఈ వికెట్ కూడా బౌలింగ్‌కు సహకరించేందుకు తగిన సమయం తీసుకుంటుంది. షార్ట్ పిచ్ బాల్స్ వేసినా లాభం లేదు. గుడ్ లెంగ్త్ బాల్స్ స్టంప్ మీదుగా వెళ్తున్నాయి.
ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ కూడా పర్వాలేదనిపించాడు. రెండో రోజు ఆట ప్రారంభంలోనే సిరాజ్‌కు క్రాంప్స్ వచ్చాయి. అయినా అతను పరుగెత్తి బౌలింగ్ చేయడం గొప్ప విషయం. ప్రపంచంలోనే జస్‌ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ బౌలర్. అతనికి సరైన సహకారం అందించాలి. అయితే ఇతర బౌలర్ల ప్రయత్నాన్ని తప్పుబట్టడం లేదు.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.