టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. బుమ్రా గాయంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 81వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్‌లో బౌలింగ్ చేస్తూ బుమ్రా కిందపడిపోయాడు. ఆ సమయంలో కామెంట్రీ చెబుతున్న రవి శాస్త్రి.. బుమ్రా కండరానికి గాయామైందని గట్టిగా అరించాడు. ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స చేయగా.. బుమ్రా లేచి ఆ ఓవర్‌ను పూర్తి చేయడంతో పాటు మరో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు కూడా తీసాడు.

గాయం కాదు.. తిమ్మిర్లు..
రెండో రోజు ఆట అనంతరం టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. బుమ్రాకు గాయం కాలేదని, అతనికి క్రాంప్స్ వచ్చాయని స్పష్టం చేశాడు. ప్రస్తుతం బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. 'బుమ్రా బాగానే ఉన్నాడు. అతనికి తిమ్మిర్లు వచ్చాయి. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్ల గాయాలను దాచలేం.'అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
ట్రావిస్ హెడ్ వల్లే..
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించానన్నాడు. కానీ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడని చెప్పాడు. 'తొలి రోజు ఆటలో భారత బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాల్సింది. కొంచెం ఎక్స్‌ట్రా స్వింగ్ కూడా ఉంది. రెండో రోజు మెరుగ్గా బౌలింగ్ చేశారు. కానీ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ట్రావిస్ హెడ్ తరహాలోనే రిషభ్ పంత్ నిర్బయంగా బ్యాటింగ్ చేస్తాడు. ర్యాంప్ షాట్స్‌తో బౌలర్లపై ఒత్తిడి తెస్తాడు. ఎదుర్కొన్న తొలి బంతినే పంత్ అలా షాట్ ఆడుతాడని అస్సలు ఊహించరు.' అని చెప్పుకొచ్చాడు.
సిరాజ్ బెస్ట్..
ట్రావిస్ హెడ్- మహమ్మద్ సిరాజ్ మధ్య నెలకొన్న మాటల యుద్దంపై కూడా మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ఈ వ్యవహారంలో సిరాజ్‌కు అండగా నిలిచాడు. 'మ్యాచ్‌లో ఇలాంటి వివాదాస్పద ఘటనలు జరగడం సహజం. సిరాజ్ ఎప్పుడూ జట్టు కోసం 100 శాతం ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే ట్రావిస్ హెడ్‌తో వాగ్వాదానికి దిగాడు. కానీ ఆఫ్ ది ఫీల్డ్‌లో సిరాజ్, ట్రావిస్ హెడ్ స్నేహంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పగలను.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.