ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్ కోసం ఆసీస్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అయ్యాడు. షమీకి ఆస్ట్రేలియా వీసా కూడా సిద్దమైందని, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) క్లియరెన్స్ కోసమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
చీలమండ గాయంతో మహహ్మద్ షమీ గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత గాయానికి సర్జరీ చేసుకున్న షమీ.. ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్లీ ఆడటం మొదలుపెట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బరిలోకి దిగాడు.

ఆసీస్‌కు షమీ..
ఈ రెండు టోర్నీల్లోనూ షమీ సత్తా చాటాడు. దాంతో షమీని ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేందుకు బీసీసీఐకి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతని కోసం వీసా కూడా సిద్దం చేసి, వీలైనంత త్వరగా అక్కడికి పంపించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ఓ అధికారి తెలిపాడు.
'భారత సెలెక్షన్ కమిటీ.. ఎన్‌సీఏ ఇచ్చే మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తోంది. షమీ.. బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లి వారు పెట్టే పరీక్షలో ఫిట్‌నెస్ నిరూపించుకోనున్నాడు. రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎన్‌సీఏ అప్రూవల్ కోసమే మేం వేచి చూస్తున్నాం.'అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
షమీ చేరికతో..
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం తడబడుతోంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో భారత పేసర్ల అనుభవలేమి సమస్యగా మారింది. పెర్త్ టెస్ట్‌లో రాణించిన హర్షిత్ రాణా.. పింక్ బాల్ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. ఈ క్రమంలోనే షమీని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. షమీ జట్టులో చేరితే భారత పేస్ విభాగం మరింత పటిష్టం కానుంది.
చివరి రెండు టెస్ట్‌లకు..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా కామెంట్రీలో షమీ ప్రస్తావన తీసుకొచ్చిన రవిశాస్త్రి.. అతని రాకతో టీమిండియా బౌలింగ్ మరింత పటిష్టమవుతుందని చెప్పాడు. అతను మూడో టెస్ట్‌కు అందుబాటులో లేకున్నా.. చివరి రెండు టెస్ట్‌లు ఆడే అవకాశం ఉందన్నాడు. 'నాకు తెలిసి షమీ.. బ్రిస్బేన్ వేదికగా జరిగే మ్యాచ్ ఆడే అవకాశం లేదు. కానీ చివరి రెండు టెస్ట్‌లకు అందుబాటులో ఉంటాడు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.