ప్రతీష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బలమైన ఆస్ట్రేలియాను ఓడించేందుకు టీమిండియా ప్రాక్టీస్ మొదలెట్టింది. అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా సాధన చేసింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లు బయటి జనాలకు కనిపించకుండా ఇనుప చువ్వల గోడపై నల్లటి కవర్లు కప్పారు.
అలాగే స్టేడియం సిబ్బంది, ప్రతినిధులు ఫోన్లు వాడటంపై పరిమితులు విధించారు. అయినప్పటకీ భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ సీక్రెట్ ప్రాక్టీస్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షించాడు. ఈ రహస్య సాధనకు గంభీర్.. పాడుబడిన వాకా మైదానాన్ని ఎంచుకున్నాడు.

ప్రస్తుతం ఆ మైదానాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఉపయోగించడం లేదు. అక్కడ కొత్త నిర్మణాలు చేపడుతున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్తాడనుకున్న గంభీర్.. నాశనం పట్టిస్తున్నాడనే కామెంట్లు వినిపించాయి. ఈ ఓటమిపై బీసీసీఐ కూడా కన్నెర్ర చేసినట్లు వార్తలు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్‌ను వివరణ కోరినట్లు ప్రచారం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో విజయం సాధించాలని గంభీర్‌ను బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సీరియస్‌గా తీసుకున్న గంభీర్.. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. భారత్-ఏతో జరగాల్సిన వామప్ మ్యాచ్‌ను రద్దు చేసిన గంభీర్.. ఈ సమయాన్ని జట్టు సన్నాహకానికి వాడుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించాలంటే ఇక్కడి పిచ్‌లపై పట్టు సాధించాలని గంభీర్ భావించాడు.
పేస్‌తో పాటు బౌన్స్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై సమర్థవంతంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా ఆటగాళ్లను సిద్దం చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైదానంగా పేరిందిన డబ్ల్యూసీఏ(వాకా) మైదానాన్ని భారత జట్టుకు శిక్షణ కోసం ఎంచుకున్నాడు.
ఈ మైదానంలోని పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న బ్యాటర్లు.. ఆసీస్ గడ్డపై ఎలాంటి పిచ్‌లోనైనా ఆడగలడు. అందుకే గంభీర్ ఈ మైదానాన్ని ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మీడియా కంటబడకుండా సీక్రేట్‌గా ఈ ట్రైనింగ్ సెషన్‌ను ప్రారంభించాడు. ఆటగాళ్లు ఎలా ప్రిపేర్ అవుతున్నారనే విషయం తెలియకుండా టీమిండియా మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంటుంది.
మంగళవారం జరిగిన తొలి సెషన్‌లో రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లు బ్యాటింగ్ సాధన చేశారు. పంత్, జైస్వాల్ భారీ షాట్లు ఆడారు. ఇక జైస్వాల్ కొట్టిన ఓ భారీ షాట్‌కు బంతి రోడ్డుపై పడినట్లు సమాచారం. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.