
విశాఖపట్నం: వన్డే ఫార్మాట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తడబాటు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సూర్య.. గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. అచ్చం ముంబై వన్డే తరహాలోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. క్లీన్ ఔట్ కావడంతో రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్ బాట పట్టాడు. మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగో లేక సూర్యకుమార్ యాదవ్ దరిద్రమో తెలియదు కానీ.. వరుస మ్యాచ్‌ల్లో సూర్య విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయిన తొలి భారత బ్యాటర్‌గా సూర్య తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు.
టీ20 నెంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్య.. వన్డేల్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరమైన నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న సూర్య.. వరుసగా రెండు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. దాంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ రెండు వైఫల్యాలతో వన్డే ఫార్మాట్‌కు సూర్య సెట్ అవ్వడనే అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. తొలి వన్డేలో స్టార్క్ బౌలింగ్‌లోనే ఔటైనా సూర్య.. ఆ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాడు. తన బలహీతనపై స్టార్క్ అటాక్ చేస్తుంటే.. సూర్య మాత్రం దాన్ని అధిగమించే ప్రయత్నం చేయలేకపోయాడు.
మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ(13) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. మరుసటి బంతికే సూర్య ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. స్టార్క్ వేసిన ఇన్‌స్వింగర్ డెలివరీని అంచనా వేయలేకపోయిన సూర్య.. డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. స్టార్క్ బౌలింగ్ గొప్పదనం కంటే సూర్య ఔటైన విధానమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో సూర్య.. ఇలా నిర్లక్ష్యంగా వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటే వన్డే ప్రపంచకప్ టీమ్‌కు దూరమవుతాడని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. కొందరైతే'నీ ఆటకు మబ్బులు కమ్ముతున్నాయారా? సూరీడు'అని విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే గిల్ క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీతో రోహిత్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. వరుస బౌండరీలతో జోరు మీద కనబడ్డాడు. కానీ స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్(13), సూర్యను ఔట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీసాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్(9)ను కూడా స్టార్క్ పెవిలియన్ చేర్చడంతో టీమిండియా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.