
చెన్నై: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సూర్య.. కీలక మూడో మ్యాచ్‌లో అష్టన్ అగర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
అష్టన్ అగర్ వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్‌లో తొలి బంతికి విరాట్ కోహ్లీ(54) క్యాచ్ ఔటవ్వగా.. మరుసటి బంతికే సూర్య వెనుదిరిగాడు. అష్టన్ అగర్ వేసిన క్విక్ లెంగ్త్ డెలివరీని బ్యాక్ ఫుట్ పంచ్‌తో సూర్య.. ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి వికెట్లను గీరాటేసింది. దాంతో సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. సూర్య వైఫల్యంతో తీవ్ర ఒత్తిడికి లోనైనా భారత బ్యాటర్లు పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్‌కు పనికిరాడని, అతనికి బదులు సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వాలని మండిపడుతున్నారు. అతని 360 డిగ్రీస్ ఆటను డీకోడ్ చేశారని విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిటిన టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 54), హార్దిక్ పాండ్యా(40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40)రాణించినా ఫలితం లేకపోయింది.