IND vs AUS: రోహిత్ నీకు మైండ్ దొబ్బిందా? ఉమేశ్ యాదవ్ ఎందుకయ్యా?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మిషన్ మెల్‌బోర్న్'లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలి టీ20లో రోహిత్ ఎంచుకున్న తుది జట్టు ఏ మాత్రం బాలేదని మండిపడుతున్నారు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న మ్యాచ్‌లో జట్టులో లేని ఉమేశ్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అర్థం పర్థం లేని ప్రయోగాలతోనే ఆసియా కప్ టోర్నీలో మూల్యం చెల్లించుకున్నారని, మళ్లీ అదే తప్పిదం చేస్తున్నారని మండిపడుతున్నారు.
బుమ్రాకు రెస్ట్..
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా జస్‌ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. బుమ్రా ఫిట్‌గా లేడని, రెండు లేదా మూడో టీ20లో బరిలోకి దిగుతాడని రోహిత్ తెలిపాడు. అంతేకాకుండా రిషభ్ పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. బుమ్రా స్థానంలో చోటు దక్కించుకున్నాడు. 2019లో చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన ఉమేశ్ మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం అందుకున్నాడు. మహమ్మద్ షమీ కరోనా బారిన పడటంతో చివరి నిమిషంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
ఉమేశ్ యాదవ్ ఎందుకయ్యా?
ఇక టీ20 ప్రపంచకప్ జట్టులో లేని ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న దీపక్ చాహర్‌కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అతనికైనా మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదని, ఉమేశ్ జట్టులోకి రావడం వల్ల ఒరిగేదేం ఉందని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మకు మైండ్ దొబ్బిందని, కెప్టెన్‌గా ఏ మాత్రం పనికిరాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
పంత్‌ను పక్కన పెడుతారా?
ఇక రిషభ్ పంత్‌ను పక్కనపెట్టడం కూడా తెలివి తక్కువ నిర్ణయమని కామెంట్ చేస్తున్నారు. జట్టులో టాప్ -6 బ్యాటర్లు రైట్ హ్యాండర్లేనని, అక్షర్ పటేల్ ఒక్కడే లెఫ్టాండరని, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నిస్తున్నారు. పంత్‌ను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించేవారని అభిప్రాయపడుతున్నారు. ఇక దీపక్ హుడాను కూడా తీసుకోవాల్సిందని, అతను ఏ స్థానంలోనైనా ఆడగలిగే ప్లేయరని కామెంట్ చేస్తున్నారు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications