IND vs AUS: సర్ఫరాజ్ ఖాన్ ఏం పాపం చేశాడు.. ఇది రంజీ క్రికెట్‌ను అవమానించడమే! ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. అయితే ఈ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదిన పృథ్వీ షాకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం దక్కగా.. టీ20ల్లో సత్తా చాటుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు తొలిసారి టెస్ట్ టీమ్ పిలుపు అందింది. అయితే రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఇప్పుడే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సెలెక్టర్లను నిలదీస్తున్నారు.
5 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు..
గత కొంతకాలంగా దేశవాళీ టోర్నీల్లో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడు. అభినవ బ్రాడ్‌మన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2019 నుంచి రంజీల్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్.. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో 431 పరుగులు చేశాడు. గత 22 ఇన్నింగ్స్‌ల్లో అతను 71 నాటౌట్, 36, 301 నాటౌట్, 226 నాటౌట్, 25, 78, 177, 6, 275,63, 48, 165, 153, 40,59 నాటౌట్, 134, 45, 5, 126 నాటౌట్, 75, 20, 162 వరుసగా పరుగులు చేశాడు. దాంతో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు అతను ఎంపికవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు.
సూర్య ఎందుకు?
రంజీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో రాణించాడనే కారణంతో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 'టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్‌ను కాదని సూర్యను ఎంపిక చేయడం దారుణం. గత రెండేళ్లలో సర్ఫరాజ్ దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. అతన్ని పట్టించుకోకపోవడం రంజీ క్రికెట్‌ను అవమానపరచడమే. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడటానికి సర్ఫరాజ్ అన్నివిధాల అర్హుడు. అతనిపై సెలక్షన్ కమిటీ మరోసారి కక్షపూరితంగా వ్యవహరించింది.'అని ఓ ట్విటర్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రంజీ క్రికెట్‌ను అవమాన పరచడమే..
'భారత జట్టులోకి రావాలంటే రంజీల్లో చేసిన పరుగులు సరిపోవా? ప్రతీ మ్యాచ్ లో 500 కొట్టాలా ఏంటిది? చేతన్ శర్మ సర్ఫరాజ్‌కు మరో షాకిచ్చాడు'అని మరో అభిమాని సెటైర్ వేసాడు. 'సూర్య, ఇషాన్‌లను ఎంపిక చేయడమంటే దేశవాళీతో పని లేకుండా కేవలం ఒకటి రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించిన వాళ్లనే తీసుకుంటామని చెప్పడమే. సరే, వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌కు ఛాన్స్ వచ్చిందనే అనుకుందాం. కానీ సూర్య ఎందుకు.? ఇది సరైన ఎంపిక కాదు.'అని మరో అభిమాని మండిపడ్డాడు. అయితే రంజీల్లో రాణించినట్లు సర్ఫరాజ్ భారత్-ఏ తరఫున రాణించలేకపోయాడని, అందుకే అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications