
ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. సొంత అభిమానులే రోహిత్ శర్మపై నోరుపారేసుకున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. మూడో టెస్ట్‌లో భారత్ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు.. వడాపావ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డవ్వడంతో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్‌ను అవమానించడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో మనల్ని మనమే కించపరుచుకోవడమని మండిపడుతున్నారు.
మూడో టెస్ట్‌లో రోహిత్ శర్బ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కుహ్నేమన్ బౌలింగ్‌లో స్టంపౌటైన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లయన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తొలి టెస్ట్‌లో రోహిత్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు సాధించాడు. మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మతో పాటు మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చతేశ్వర్ పుజారా ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. అతనికి అండగా ఎవరూ నిలవలేకపోయారు. ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని సహించలేకపోయిన అభిమానులు రోహిత్ శర్మపై నోరు పారేసుకున్నారు.
76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 18.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగినా.. ట్రావిస్ హెడ్(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 6 ఫోర్లతో 28) అటాకింగ్ గేమ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసి 88 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన భారత్ 163 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బతీస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లయర్ 8 వికెట్లతో పతనాన్ని శాసించాడు.