IND vs AUS: ప్రధానుల రాకతో టికెట్లు బ్లాక్ చేయలేదు.. అవన్నీ గాలి వార్తలే!

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు టికెట్లు ఆన్‌లైన్ వేదికగా అందుబాటులో ఉన్నాయని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) ప్రకటించింది. ఈ టెస్ట్ మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌లు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇక ప్రధానుల రాక నేపథ్యంలో తొలి రోజు ఆటకు సంబంధించిన టికెట్లను జీసీఏ బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
భద్రతా నేపథ్యంలో టికెట్లు బ్లాక్ చేశారని కొందరంటే.. బీజేపీ కార్యకర్తల కోసమే టికెట్లు అమ్మడం లేదని మరికొందరు కామెంట్ చేశారు. అయితే ఈ ప్రచారాన్ని జీసీఏ ఖండించింది. ఇవన్నీ గాలి వార్తలేనని స్పష్టం చేసింది. ప్రేక్షకులు లేకుండా టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహిస్తే తమకు ఏం వస్తుందని ప్రశ్నించింది. టికెట్ల విషయమై జీసీఏ సెక్రటరీ అనిల్ పాటిల్ సోమవారం మీడియాతో మాట్లాడారు.

బుక్‌మై షోలో ఉన్నాయి..
'నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటకు సంబంధించిన టికెట్లు బ్లాక్ చేశారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటకు సంబంధించిన టికెట్లు బుక్‌మై షో యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే భద్రతా కారణాల వల్ల కొన్ని ఎంపిక చేసిన సీట్లలో మాత్రం ప్రేక్షకులను అనుమతించడం లేదు. మిగిలిన సీట్లు అభిమానులు యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.'అని స్పష్టం చేశారు.
మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా సైతం.. అహ్మదాబాద్ టెస్ట్‌కు సంబంధించిన టికెట్లు బుక్‌మై షోలో అందుబాటులో ఉన్నాయని ట్వీట్ చేసింది.

సిరీస్ డిసైడర్ మ్యాచ్..
ఇరు దేశాల ప్రధానులు రానున్న నేపథ్యంలో అహ్మదాబాద్ టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటారని జీసీఏ భావిస్తోంది.
అంతేకాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ మ్యాచ్ ఫలితంతోనే సిరీస్ విజేత తేలనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోనుంది.

మళ్లీ స్పిన్ పిచ్?
ఇక ఇండోర్‌లో పూర్తిగా టర్నింగ్ ట్రాక్ తయారు చేసి ఐసీసీ ఆగ్రహానికి గురైన బీసీసీఐ.. చివరి టెస్ట్‌లో ఎలాంటి వికెట్ తయారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాలతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశం పయనం కాగా.. స్టీవ్ స్మిత్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ఇండోర్ టెస్ట్‌లో తనదైన సారథ్యంతో జట్టుకు విజయాన్నందించాడు. నాలుగో టెస్ట్‌కు కూడా కమిన్స్ దూరమవ్వడంతో.. స్మిత్ సారథ్యంలోనే ఆసీస్ బరిలోకి దిగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications