ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్‌ను వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా తప్పుబట్టాడు. పరిస్థితులను పట్టించుకోకుండా షాట్స్ ఆడటంతోనే భారత బ్యాటర్లు విఫలమయ్యారని అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులే చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసింది. మరోవైపు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోర్ చేసి 157 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. భారత్ ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన పుజారా.. భారత బ్యాటర్ల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించాడు.

'భారత బ్యాటర్లు బ్యాటింగ్ అప్రోచ్ చూస్తేంటే.. సానుకూలంగా ఆడాలని టీమ్ మీటింగ్‌లో నిర్ణయించినట్లు అర్థమవుతోంది. అయితే పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బంతితో చాలా ఓపికగా బ్యాటింగ్ చేశారు. కానీ తాజా మ్యాచ్‌లో తొలి 15-20 ఓవర్లలోనే చాలా షాట్స్ ఆడి మూల్యం చెల్లించుకున్నారు.
అటాకింగ్ గేమ్‌తో బౌలర్లపై ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ పిచ్ కండిషన్స్‌ను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ లైన్‌లో బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు స్టంప్‌ను టార్గెట్ చేస్తూ ఫుల్లర్ లెంగ్త్ బాల్స్ వేసారు. భారత బౌలింగ్‌ను చూసి ఆస్ట్రేలియా బౌలర్లు నేర్చుకున్నారు. వారు ఎక్కువగా టాప్ ఆఫ్ ఆఫ్ డెలివరీలతో పాటు బౌన్సర్లు సంధించారు.
ఆస్ట్రేలియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ భారత బ్యాటర్ల షాట్ సెలెక్షన్ కూడా మెరుగ్గా ఉండాలి. కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. డిఫెన్స్ మరింత ఆత్మవిశ్వాసం కనబర్చాలి. అయితే పింక్ బాల్‌తో ఆడిన అనుభవం ఎక్కువ లేకపోవడంతోనే భారత బ్యాటర్లు తడబడ్డారు. భారత్ ఎక్కువగా డే/నైట్ మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి ఆ బంతితో ఆడిన అనుభవం ఎక్కువగా లేదు.
బాల్ ఎక్కువగా స్కిడ్ అవుతుంది. అలాగే రియాక్షన్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఔటైన బ్యాటర్లంతా బంతిని లేట్‌గా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. విరాట్ కోహ్లీ తన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమించాలి. వికెట్ కీపర్లకు క్యాచ్ ఇచ్చి వెనుదిరుగుతున్నాడు. నెట్స్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టాలి.'అని పుజారా చెప్పుకొచ్చాడు.