ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా సిద్దమైంది. మరికొన్ని గంటల్లో పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని మైదానంలోకి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ముందు ఇరు జట్ల కెప్టెన్లు తమ ప్రిపరేషన్స్‌పై ధీమా వ్యక్తం చేశారు. మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పారు.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం చాలా ముఖ్యం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా ఇజ్జత్‌కు సవాల్‌గా మారింది.

అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా 4-0తో గెలుచుకోవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. డబ్ల్యూటీసీ 2024-25 సైకిల్‌లో టీమిండియా ఇదే చివరి టెస్ట్ సిరీస్.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని గత రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉండటం సానుకూలాంశం. 2016 నుంచి ఈ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ(2018-19, 2020-21) భారత్ విజేతగా నిలిచింది.
జియోసినిమాలో రాదు..
ఈ ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌కు చెందిన ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ ఛానెల్లతో పాటు స్టార్ స్పోర్ట్స్ 4 తెలుగు, మళయాళం, కన్నడ వంటి స్థానిక భాషాల్లోనూ లైవ్ రానుంది.
అయితే ఈ ఛానెల్స్‌ను సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హాట్ స్టార్‌లో కూడా ఈ సిరీస్ ఫ్రీగా రాదు. డబ్బులు చెల్లించాల్సిందే. జియోసినిమాలో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో హాట్ స్టార్ కూడా దిగొచ్చి కొన్నిరోజులు ఫ్రీగా లైవ్ ఇచ్చింది. కానీ గత కొన్ని రోజులుగా ఫ్రీగా మ్యాచ్‌లు ప్రసారం చేయడంలేదు. దాంతో అందరూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..
భారత క్రికెట్ అభిమానుల కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్‌లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. ఈ ఛానెల్‌ను ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)
భారత జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.
తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా/ఆకాశ్ దీప్