
న్యూఢిల్లీ: తెలుగు తేజం, ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు కేఎస్ భరత్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికవ్వనున్నాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై గాయపడటంతో అతను 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు సిద్దంగా ఉండాలని బీసీసీఐ నుంచి కేఎస్ భరత్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా భారత జట్టుకు భరత్ ఎంపిక అవుతున్నప్పటికీ.. కేవలం బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే ఉండిపోయాడు. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌కు తొలి సారిగా భారత జట్టు పిలుపును అందుకున్నాడు. కానీ సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా కారణంగా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ రెండో టెస్టులో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ అయిన సాహాను పక్కనపెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ రిషభ్ పంత్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా బ్యాకప్‌గా కేఎస్ భరత్‌ను ఎంపిక చేస్తూ వస్తోంది.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్ బ్యాకప్ కీపర్‌గా జట్టులో చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్‌లకు కూడా బెంచ్‌కే పరిమితమ్యాడు. ఇక భరత్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కూడా భరత్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4500 పరుగులు చేసిన భరత్.. 9 సెంచరీలతో పాటు 25 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే భరత్‌కు ఇషాన్ కిషన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవ్వనుంది.
బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మూడు ఫార్మాట్లలో అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు బీసీసీఐ కూడా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భరత్‌కు బ్యాక్‌ఆప్ వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో భరత్ అంతటి అనుభవం లేకపోయినా.. దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ టీమ్‌ను ఇషాన్ మూడు ఫార్మాట్లో నడిపిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6 సెంచరీలతో ఇప్పటికే 3000 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ విస్మరించలేదు. బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ఇషాన్.. భరత్‌ను వెనక్కనెట్టి ముందుకు కూడా రాగలడు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశంలో భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.