ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించిన టీమిండియా.. ఆ జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసిన విషయం తెలిసిందే. మరో 5 రోజుల వ్యవధిలోనే బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
శనివారం నుంచి మొదలయ్యే ఈ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించాలంటే స్టార్ పేసర్ మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సూచించాడు. మూడో టెస్ట్‌లో ఆడించకుండా మహహ్మద్ షమీని చివరి రెండు టెస్ట్‌ల్లో ఆడించడం వల్ల వచ్చే లాభం ఏం లేదన్నాడు.

'మహమ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమయ్యాడనే వార్తలను మేం విన్నాం. కానీ అతను నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. షమీ నాలుగో టెస్ట్ ఆడటం వల్ల టీమిండియాకు ఒరిగేది ఏం ఉండదు. షమీని వెంటనే ఆసీస్ పంపించి బ్రిస్బేన్ టెస్ట్ ఆడించాలి.
అలా కాకుండా మెల్‌బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్ ఆడించాలనుకుంటే మాత్రం అతన్ని పిలవకపోవడమే ఉత్తమం. టీమిండియాకు మహమ్మద్ షమీ అవసరం ఉంది. షమీతోనే భారత పేస్ విభాగం బలం పెరగనుంది.'అని బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు మహమ్మద్ షమీ సిద్దంగా ఉన్నాడని, అతని వీసా కూడా రెడీ అయిందని వార్తలు వచ్చాయి. ఎన్‌సీఏ మెడికల్ టీమ్ క్లియరేన్స్ కోసం భారత సెలెక్టర్లు వేచిచూస్తున్నారని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం షమీ రాకపై భిన్నంగా స్పందించాడు. రెండో టెస్ట్ పరాజయం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. షమీని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని చెప్పాడు.

'మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. అతని కోసం భారత జట్టు తలుపులు తెరిచే ఉన్నాయి. కానీ బీసీసీఐ మెడికల్ టీమ్ షమీని ప్రత్యేక పర్యవేక్షిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత షమీ మోకాలు వాచింది. ఇది అతని రీఎంట్రీకి ఆటంకం కలిగిస్తోంది.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
చీలమండ గాయంతో మహమ్మద్ షమీ గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా తరఫున ఆడాడు. సర్జరీ అనంతరం సుదీర్ఘ కాలం రెస్ట్ తీసుకున్న షమీ.. ఇటీవలే మళ్లీ బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు.