
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ టెస్ట్ పరాజయం అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశం వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే కమిన్స్ ఉన్న పళంగా భారత్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో మూడో టెస్ట్‌కు 9 రోజుల బ్రేక్ లభించింది. దాంతో కమిన్స్ స్వదేశం వెళ్లి తిరిగిరావాలనుకున్నాడని ఆసీస్ టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
మూడో టెస్ట్ మార్చి1న ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది. ఆలోపు కమిన్స్ తిరిగివస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వర్గాలు తెలిపాయి . అయితే కమిన్స్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే అతను ఉన్న పళంగా ఆసీస్ పయనమైనట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల కమిన్స్ మూడో టెస్ట్ ఆడలేకపోతే వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. రెండు టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కమిన్స్ విఫలమయ్యాడు. తొలి టెస్ట్‌లో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే తీసుకొని నష్టపోయిన కమిన్స్.. రెండో టెస్ట్‌లో ఎక్స్‌ట్రా పేసర్ లేక మూల్యం చెల్లించుకున్నాడు.

ఫీల్డ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పుల్లో కూడా కమిన్స్ తడబడ్డాడు. ఇక పేలవ బ్యాటింగ్‌తో ఆసీస్ రెండు టెస్ట్‌ల్లోనూ ఓటమిపాలైంది. వికెట్‌కు తగ్గట్లు ఆడటంలోనూ తడబడింది. ముఖ్యంగా ఢిల్లీ టెస్ట్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకుంది. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో స్వీప్, రివర్స్ స్వీప్‌లకు ప్రయత్నించి ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు ఔటయ్యారు. స్పిన్నర్లను ఎదుర్కోడానికి ఏడెనిమిది రకాల షాట్లు ఉన్నాయన్న సంగతిని ఆస్ట్రేలియా బ్యాటర్లు పూర్తిగా మరిచిపోయారు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ మొదటి బంతినే సిక్సర్ బాదడానికి స్వీప్ ఆడి క్లీన్‌బౌల్డ్ అవ్వడం దీనికి నిదర్శనం.
పరిస్థితులకు అలవాటు పడకుండా.. పిచ్‌పై అవగాహన లేకుండా.. స్వీప్, రివర్స్ స్వీప్ వంటి షాట్లతోనే స్పిన్‌ను అడ్డుకోవచ్చని భావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. చివరి రెండు టెస్టుల్లో అశ్విన్, జడేజాలను సమర్థంగా ఎదుర్కోడానికి ఆసీస్ బ్యాటర్లకు రాకెట్ సైన్స్ అవసరం లేదు. గావస్కర్, గోవర్, ఛాపెల్ సోదరులు, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌ల పాత బ్యాటింగ్ వీడియోలు చూస్తే సరిపోతుందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.