మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా పేలవ ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైందని ఆ జట్టు దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరూ టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా తరహాలో రాణించలేకపోయారని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పింక్ బాల్ టెస్ట్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
ఈ గెలుపుతో తొలి టెస్ట్‌లో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంది. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పింక్ బాల్ టెస్ట్‌లో సిరాజ్, బుమ్రా నాలుగేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా ఒక్క వికెట్ కూడా తీయలేదు.

ఈ మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన ఆడమ్ గిల్‌క్రిస్ట్.. సిరాజ్, రాణా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదన్నాడు. 'ఈ సిరీస్ కోసం భారత్ ఇక్కడికి వచ్చినప్పుడు జస్‌ప్రీత్ బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి లభించే మద్దతుపై అనిశ్చితి నెలకొంది. అయితే సిరాజ్, హర్షిత్ రాణా పెర్త్ టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. కానీ అడిలైడ్‌లో మాత్రం ఆ తరహా ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. బుమ్రా అసాధారణ రీతిలో బౌలింగ్ చేశాడు. కానీ మిగతా బౌలర్లు ఆ స్థాయిని అందుకోలేకపోయారు.'అని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్య్యూలో గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పోస్ట్ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బుమ్రాకు తోడుగా మిగతా పేసర్లు రాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఎప్పుడూ బుమ్రా ఒక్కడే రాణించాలంటే కుదురదన్నాడు. 'మేం ఒక్క బౌలర్‌తోనే ఆడటం లేదు. జట్టులో ఉన్న మిగతా బౌలర్లు కూడా బాధ్యత తీసుకొని టీమ్ గెలుపు కోసం కృష్టి చేయాలి. సిరాజ్, హర్షిత్ రాణా, నితీష్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ ఎవరైనా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో గెలవడంపై టీమిండియా ఫోకస్ పెట్టింది. అందుకోసం వ్యూహాలను సిద్దం చేస్తోంది. గత పర్యటనలో గబ్బాపై టీమిండియా అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది.