
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. మిచెల్ స్టార్క్ ధాటికి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. టీ20 ఫార్మాట్‌లో తనకే సాధ్యమైన 360 డిగ్రీస్ ఆటతో నెంబర్ వన్‌గా నిలిచిన సూర్య.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఇప్పటి వరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు.
శ్రేయస్ అయ్యర్ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న సూర్య.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టులో తన స్థానం సుస్థిరం కావాలంటే రాణించడం సూర్యకు అత్యంత కీలకం.

చెన్నై వేదికగా బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ సూర్య చోటుకు డోకా లేదు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ నేపథ్యంలో అతను చివరి అవకాశంగా బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక సలహా ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించి రెండు బంతులు ఓపికగా ఆడాలని అడ్వైజ్ ఇచ్చాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఫించ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటికే మిచెల్ స్టార్క్ విసిరిన రెండు అద్భుతమైన బంతులకు సూర్య తన వికెట్ చేజార్చుకున్నాడు. అయితే మిచెల్ స్టార్క్ ఏ ప్రదేశంలో బంతిని హిట్ చేస్తున్నాడో ఇప్పటికే సూర్యాకు తెలుసుంటుంది. కాబట్టి తొలి రెండు బంతుల్ని తెలివిగా ఆడాలి.'అని ఆరోన్ ఫించ్ సూచించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ వన్డే సిరీస్‌కి అరోన్ ఫించ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో చెరొక మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు.. చెన్నై వన్డేలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది.