
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున రవీంద్ర జడేజా ఆడటం చాలా కీలకమని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియా బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉందని, జడేజా కూడా లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నాడు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో గాయపడి రిషభ్ పంత్ జట్టుకు దూరం కాగా.. ఈ సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయంతో నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. అతను తొలి రెండు టెస్ట్‌లు ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండి జట్టుకు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని ఆకాశ్ చోప్రా తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ గురించి తన యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. టీమ్ కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నాడు. అతను ఇటీవల ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడి చాలా వికెట్లు పడగొట్టాడు. జడేజా ఇప్పటికే భారత జట్టు శిబిరంలో భాగమయ్యాడు. జడేజా ఫిట్‌గా ఉండటం టీమిండియాకు చాలా ముఖ్యం. ఎందుకంటే రిషభ్ పంత్ అందుబాటులో లేడు.

శ్రేయస్ అయ్యర్ ఆడేది కూడా అనుమానంగానే ఉంది. శ్రేయస్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఆ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. అయ్యర్ అందుబాటులో లేకుంటే సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కొచ్చు. హనుమ విహారి కూడా జట్టులో లేడు. జడేజా కూడా అందుబాటులో లేకపోతే బ్యాటింగ్ విభాగం చాలా బలహీనంగా మారుతుంది. కాబట్టి, జడేజా ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డ జడేజా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే. అతని మోకాలికి సర్జరీ జరగడంతో ఐదు నెలలపాటు ఆటకు దూరమైన జడేజా.. ఇటీవలే కోలుకుని రంజీ ట్రోఫీతో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌ను కూడా క్లియర్ చేసిన జడేజా.. నాగ్‌పూర్‌లో నిర్వహించే ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు.