ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. ఆ జోరును మాత్రం కొసాగించలేకపోయింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం అక్కడికి వెళ్లిన టీమిండియా.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించాడు.
అటు కెప్టెన్‌గా ఇటు బౌలర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చిన బుమ్రా.. భారత్‌కు రికార్డ్ విజయాన్నందించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌కు రోహిత్ శర్మ అందుబాటులోకి రాగా.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోహిత్ చెత్త కెప్టెన్సీ కారణంగానే పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైందని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ రక్షణాత్మక సారథ్యమే టీమిండియా ఓటమికి కారణమైందన్నాడు. గత నాలుగు టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ దారుణంగా ఉందన్నాడు. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆట తొలి సెషన్‌లో బుమ్రాతో నాలుగు ఓవర్లే వేయించడాన్ని ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు.
'పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆట తొలి సెషన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేశాడు. ఓ వికెట్ కూడా తీసాడు. కానీ ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. ఆ సెషన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ తప్పిదం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాకు ఇది నిజమే అనిపించింది. రోహిత్ శర్మ డిఫెన్సివ్ కెప్టెన్సీ చేశాడు.

అందువల్లే భారత్‌కు ఓటమి ఎదురైంది. గత 100 ఏళ్లలో ధోనీ, కోహ్లీ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన కెప్టెన్ రోహిత్ శర్మనే. అతని సారథ్యంలోనే టీమిండియా.. సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. రోహిత్ కెప్టెన్సీ మరీ పేలవంగా ఉంది. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు బుమ్రాకు అండగా ఇతర పేసర్లు రాణించకపోవడంతో పింక్ బాల్ టెస్ట్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
2011-2014 మధ్య ధోనీ సారథ్యంలో భారత జట్టు వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. 2020-21 మధ్య కోహ్లీ నాయకత్వంలోనూ టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది.