ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరగడంతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది.
రిషభ్ పంత్(98 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40), రవీంద్ర జడేజా(95 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.చివర్లో బుమ్రా(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) విలువైన పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్బోలాండ్(4/31) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్(2/37) రెండు వికెట్లు దక్కాయి. నాథన్ లయన్ ఓ వికెట్ తీసాడు.

తేలిపోయిన భారత బ్యాటర్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే యశస్వి జైస్వాల్(10)ను బోలాండ్ స్టన్నింగ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే అతనికి లైఫ్ లభించింది.
ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కోహ్లీ వెంటాడగా.. స్లిప్‌లో ఉన్న స్మిత్ వైపు దూసుకెళ్లింది. అయితే అతను బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఔటయ్యే ప్రమాదం నుంచి కోహ్లీ బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఆచితూచి ఆడాడు.
ఓపికగా ఆడిన ఈ జోడీని నాథన్ లయన్ విడదీసాడు. తొలి సెషన్ ఆఖరి బంతికి శుభ్‌మన్ గిల్ అనవసర షాట్‌తో పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 57/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
పోరాడిన రిషభ్ పంత్..
క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే కోహ్లీ(17) మరోసారి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. మళ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి పంత్ పోరాడాడు. శరీరాన్ని అడ్డుపెట్టి క్రీజులో నిలబడ్డాడు. పిచ్‌పై అనూహ్య బౌన్స్ ఉండటంతో బంతి అనేకసార్లు రిషభ్ పంత్ శరీరానికి తాకింది. 107/4 స్కోర్‌తో టీమిండియా టీ బ్రేక్‌కు వెళ్లింది.
చివరి సెషన్‌లోనూ పంత్-జడేజా ఓపికగా బ్యాటింగ్ చేశారు. పదే పదే బంతులు రిషభ్ పంత్‌కు తాకాయి. దెబ్బల వల్లనో ఏమో తెలియదు కానీ 97 బంతులు ఓపికగా ఆడిన పంత్.. అనసవర షాట్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డకౌటయ్యాడు.దాంతో భారత్ కోలుకోలేకపోయింది.
బుమ్రా జోరు..
కాసేపటికే జడేజా(26) కూడా ఔటవ్వగా.. సుందర్ పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్నికమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. ఈ పరిస్థితుల్లో జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌లతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు 185 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు.
అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఉస్మాన్ ఖవాజా(2)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.