భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసీస్ టాప్-4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 86 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉష్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(111 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 68 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

సామ్ కోన్‌స్టాస్ విధ్వంసం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కెరీర్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నామనే బెరుకు లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను టార్గెట్ చేసిన సామ్ కోన్‌స్టాస్..అతనిపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతని ధాటికి మూడేళ్ల తర్వాత బుమ్రా టెస్ట్‌ల్లో సిక్స్ సమర్పించుకున్నాడు.
తేలిపోయిన బుమ్రా..
ఎన్నడూ లేని విధంగా తొలి 6 ఓవర్లలోనే 38 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సామ్ కోన్‌స్టాస్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. పేసర్లను అలవోకగా ఆడుతున్న సామ్ కోన్‌స్టాస్‌ను కట్టడి చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ రవీంద్ర జడేజాను బరిలోకి దించాడు. అతను అద్భుతమైన బంతితో కోన్‌స్టాస్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఆచితూచి ఆడాడు. దాంతో ఆస్ట్రేలియా 112/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్ వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజా 101 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు. ఉస్మాన్ ఖవాజాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ రాగా.. లబుషేన్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో పరుగులు చేశాడు. దాంతో ఆస్ట్రేలియా 176/2 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
ట్రావిస్ హెడ్ డక్..
మూడో సెషన్‌లో మరింత సాధికారికంగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. లబుషేన్ 114 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మిత్ 71 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. సెంచరీ దిశగా సాగిన లబుషేన్‌ను వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో అతను డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
తన మరుసటి ఓవర్‌లోనే మిచెల్ మార్ష్(4)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలోనే అలెక్స్ క్యారీతో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 6వ వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం.. అలెక్స్ క్యారీ(31)ని ఆకాశ్ దీప్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి ప్యాట్ కమిన్స్ రాగా.. మరో వికెట్ పడకుండా స్మిత్ జాగ్రత్తగా ఆడాడు.