ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మెల్ బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో 184 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా పేలవ బ్యాటింగ్‌తో పాటు చెత్త కెప్టెన్సీ, రిషభ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ టీమిండియా ఓటమిని శాసించింది.
బ్యాటింగ్ వైఫల్యం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేసిన ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. ఆసీస్ టాప్-4 బ్యాటర్లు 50 ప్లస్ రన్స్ చేస్తే.. భారత టాప్-4 బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ మినహా ఎవరూ రాణించలేదు.

జైస్వాల్, కోహ్లీ ఆచితూచి ఆడి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ అనసవరం పరుగు కోసం ప్రయత్నించి జైస్వాల్ రనౌటవ్వడం టీమిండియా కొంపముంచింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. లోయరార్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత శతకంతో పాటు వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో టీమిండియా ఫాలో ఆన్ గండం గట్టెక్కి మ్యాచ్ రేసులోకి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ యశస్వి జైస్వాల్ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. టాప్-4 బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌కు అండగా మరో బ్యాటర్ రాణించినా ఫలితం మరోలా ఉండేది.
కొంపముంచిన రిషభ్ పంత్..
తొలి ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడిన రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తప్పిదం చేశాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపికగా బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్ మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించాడు. ఈ ఇద్దరి బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్ భారత్ గట్టెక్కినట్లేనని అంతా అనుకున్నారు. 104 బంతులు ఆడిన రిషభ్ పంత్103 బంతులు చాలా ఓపికగా బ్యాటింగ్ చేశాడు. ఊరించేలా బంతులేసి సహనం కోల్పోలేదు. కానీ పార్ట్ టైమర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ తప్పిదం టీమిండియా ఓటమిని శాసించింది. మరో 15-20 ఓవర్ల వరకు రిషభ్ పంత్ ఓపికగా బ్యాటింగ్ చేసుంటే.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి తప్పించుకునేది.
యశస్వి జైస్వాల్ చెత్త ఫీల్డింగ్..
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 150 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్ చేతుల్లోకి వచ్చిన మూడు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో చెలరేగిన మార్నస్ లబుషేన్, ప్యాట్ కమిన్స్ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మూడు క్యాచ్‌లు పట్టి ఉంటే ఆసీస్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. అప్పుడు భారత్ ముందు తక్కువ లక్ష్యం ఉండి గెలవడానికి ఆస్కారం ఉండేది.
రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ..
ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా విఫలమయ్యాడు. ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల్లో తడబడ్డాడు. ముఖ్యంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌ను సాధించలేకపోయాడు. దాంతో నాథన్ లయన్- బోలాండ్ ఆఖరి వికెట్‌కు 61 పరుగులు జోడించారు.