ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ.. పింక్ బాల్ టెస్ట్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
అయితే రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో అతన్నే ఓపెనర్‌గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. రాహుల్ ఓపెనర్‌గా ఆడనుండటంతో రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ.. మళ్లీ 6 ఏళ్ల తర్వాత అదే స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాంతో మిడిలార్డర్‌లో రోహిత్ శర్మ గణంకాలు ఎలా ఉన్నాయనే ఆతృత అభిమానుల్లో నెలకొంది.

2018లో చివరిసారిగా మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగి అసాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ రోహిత్ మిడిలార్డర్‌లో ఆడుతుండటంతో అతని ఆట ఎలా ఉంటుందోననే అంచనాలు పెరిగిపోయాయి.
ఇప్పటి వరకు రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో 30 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మూడో స్థానంలో 4 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేసి 107 పరుగులే చేశాడు. నాలుగో స్థానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన రోహిత్ 4 పరుగులే చేశాడు. ఐదో స్థానంలో 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 3 హాఫ్ సెంచరీలతో 437 రన్స్ కొట్టాడు.
ఆరో స్థానంలో 16 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 1037 రన్స్ చేశాడు. మిడిలార్డర్‌లో రోహిత్ నాలుగు సార్లు డకౌటయ్యాడు. పింక్ బాల్ టెస్ట్‌లోనూ రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రోహిత్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తేనే.. నాథన్ లయన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడని భావిస్తున్నారు.