
39 వేల టికెట్లు..
మెజారిటీ అభిమానులు పేటీఎంలో ఎంత ప్రయత్నించినా.. తమకు టికెట్లు దొరకలేదని చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39వేలు కాగా.. తొలి దఫాలో పేటీఎంలో ఎన్ని టికెట్లు అమ్మారు? ఇంకా ఎన్ని మిగిలున్నాయి? అనేదానిపై క్లారిటీ లేదు. సెకండ్ ఫేజ్ టికెట్లు త్వరలో అందుబాటులో ఉంచుతామని పేటీఎం చెప్పినా.. ఎప్పిటి నుంచి సేల్ చేస్తారు? ఏయే కేటగిరీ టికెట్లు ఎన్ని ఉన్నాయి అనేదానిపై క్లారిటీ లేదు. దాంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నాయకులు, అధికార యంత్రాంగం, క్లబ్ సెక్రటరీలకు కాంప్లిమెంటరీ పాస్‌లు పెద్ద సంఖ్యలో కేటాయించడంతో పాటు అధ్యక్షుడు అజారుద్దీన్ చుట్టూ ఉండే కోటరీ ఎక్కువ శాతం టిక్కెట్లను బ్లాక్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి.

అడ్డగోలుగా అమ్మకాలు..
అందుకే సాధారణ అభిమానులకు టిక్కెట్లు దొరకడం గగనంగా మారిపోయిందని తెలుస్తోంది. ఇక, సీటింగ్ సామర్థ్యం కాకుండా కార్పొరేట్ బాక్స్‌ల (ఒక్కో బాక్స్‌లో 20 మందికి అనుమతి) విక్రయంలోనూ పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతున్నదని సమాచారం. ఇందులోని రెండు బాక్స్‌లు భారతి సిమెంట్స్, జీఎంఆర్‌కు లీజు రూపంలో ఉండగా, మిగిలినవన్నీ ఇష్టానుసారం రూ.4 నుంచి 6 లక్షల వరకు విక్రయించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షించడానికి మాజీ చీఫ్ జస్టిస్ కక్రూ, ఐపీఎస్ అంజనీ కుమార్, మరో ఇద్దరు సభ్యులతో సుప్రీంకోర్టు ఇటీవల కమిటీ వేసింది. ఈ కమిటీ తక్షణమే జోక్యం చేసుకొని టిక్కెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

పట్టించుకోని హెచ్‌సీఏ..
మరోవైపు పాసులు కావాలని తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, అవన్నీ పుకార్లే అని హెచ్‌సీఏ తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నివారించడానికి మొత్తం టికెట్లను పేటీఎంలోనే పారదర్శకంగా అమ్మకానికి ఉంచుతామని స్పష్టం చేసింది. కానీ అభిమానులు మాత్రం పేటీఎంలో టికెట్ల కోసం చూసి విసిగిత్తిపోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హెచ్‌సీఏ తీరుపై ఓ న్యాయవాది హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. టికెట్ల విషయంపై ఇంత రగడ జరుగుతున్న అటు హెచ్‌సీఏ కానీ.. ఇటు అజారుద్దీన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేకపోవడం అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

జింఖానా గ్రౌండ్ వద్ద ఆందోళన..
జింఖానా గ్రౌండ్ కు వచ్చి టికెట్ల కోసం గంటల కొద్దీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ క్రికెట్ మ్యాచ్ టికెట్ విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రస్టేషన్ కు గురవుతున్నారు. వారం రోజులుగా టికెట్ కోసం వస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. టికెట్స్ కోసం వస్తే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం తెలియదని గేట్లకు తాళాలు వేస్తున్నారని చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్ దగ్గర అభిమానుల పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.


Click it and Unblock the Notifications












