ఆస్ట్రేలియా గడ్డపై బ్యాటింగ్‌లో తేలిపోయిన భారత్-ఏ జట్టు.. బౌలింగ్‌లో మాత్రం దుమ్మురేపుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు 47.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దేవదత్ పడిక్కల్(77 బంతుల్లో 2 ఫోర్లతో 36), నవ్‌దీప్ సైనీ(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23), సాయి సుదర్శన్(35 బంతుల్లో ఫోర్‌తో 21) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిమన్యు ఈశ్వరన్(7), రుతరాజ్ గైక్వాడ్(0), బాబా ఇంద్రజీత్(9), ఇషాన్ కిషన్(4), నితీష్ కుమార్ రెడ్డి(0) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెండన్ డొగ్గెట్(6/15) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోర్డాన్ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గస్ తలో వికెట్ తీసారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనే(29 బ్యాటింగ్), కూపర్ కన్నోల్లీ(14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లతో నిప్పులు చెరిగారు. నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. భారత బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. ఆస్ట్రేలియా-ఏ ఇంకా 8 పరుగుల వెనుకంజలో ఉంది.