IND vs AUS 1st T20: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్మురేపారు. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహమో లేక ఐపీఎల్ 2024లో భాగం కావాలనే ఆశనో తెలియదు కానీ జోష్ ఇంగ్లీస్(50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 110) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
భారత బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడిన జోష్ ఇంగ్లీస్.. టీ20 కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(41 బంతుల్లో 8 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన స్మిత్, మాథ్యూ షార్ట్ బౌండరీలతో జోరు కనబర్చారు. పవర్ ప్లేలోనే రవిబిష్ణోయ్‌ను రంగంలోకి దింపిన సూర్య ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. మాథ్యూ షార్ట్‌ను బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లీస్ బౌండరీ బాదగా.. పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.
జోరుగా జోష్ బ్యాటింగ్..
అనంతరం జోష్ ఇంగ్లీస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ప్రసిధ్ కృష్ణను టార్గెట్ చేసిన అతను వరుసగా 6, 4, 4 బాది ఏడో ఓవర్‌లో 19 పరుగులు పిండుకున్నాడు. అయితే బిష్ణోయ్ వేసిన మరుసటి ఓవర్‌లో జోష్ ఇంగ్లీస్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫీల్డర్ వేసిన బంతిని బిష్ణోయ్ సరిగ్గా అందుకోలేకపోయాడు.
37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతనికి ఈ లైఫ్ లభించింది. ఈ అవకాశంతో చెలరేనిన అతను.. బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాది 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తేలిపోయిన బౌలర్లు..
అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు స్మిత్ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో బౌండరీ బాదిన స్మిత్ 40 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. ఆ మరుసటి బంతికే రనౌటయ్యాడు.
క్రీజులోకి మార్కస్ స్టోయినీస్ రాగా.. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 17వ ఓవర్‌లో జోష్ ఇంగ్లీస్ ఫోర్ బాది టీ20ల్లో తొలి సెంచరీ అందుకున్నాడు.
ధాటిగా ఆడే క్రమంలో ప్రసిధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లో స్టోయినీస్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బిష్ణోయ్ నేలపాలు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో 16 పరుగులు రాగా.. చివరి ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ 4 పరుగుల మాత్రమే ఇచ్చాడు.