టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 40 బతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచిన దూబే.. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్ తీసాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
మ్యాచ్ అనంతరం కామెంటేటర్ సురేశ్ రైనాతో శివమ్ దూబే జరిపిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. దూబే ప్రదర్శనను కొనియాడిన రైనా..'ధోనీ భాయ్ ఈ మ్యాచ్‌లో నీ బౌలింగ్ చూసుంటే సీఎస్‌కే తరఫున కచ్చితంగా మూడు ఓవర్లు వేయిస్తాడు'అని రైనా కొనియాడాడు. వెంటనే శివమ్ దూబే.. 'ధోనీ భయ్యా.. రైనా చెప్పేది వినయ్యా'అని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ధోనీ భాయ్ వల్లే తన ప్రదర్శన మెరుగైందని శివమ్ దూబే ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.'నేను తరుచూ ధోనీ భాయ్‌తో మాట్లాడుతాను. అతను దిగ్గజ ఆటగాడు. అతని నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను. అతన్ని నిశితంగా పరిశీలిస్తున్నా. విభిన్న పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో ఆయన తరుచూ నాకు చెబుతుంటాడు.
ఆయన నాకు ఇచ్చిన టిప్స్ కూడా బాగా పని చేశాయి. చాలా సార్లు ఆయన నేనో మంచి ఆటగాడినని కితాబిచ్చాడు. ఆయన గుడ్ ప్లేయర్ అన్న తర్వాత నేను కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తాను. నా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.'అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ సైతం సానుకూలంగా బ్యాటింగ్ చేయాలని సూచించాడని, ఏ స్థానంలోనైనా పరుగులు చేసే సత్తా ఉందని చెప్పాడని శివమ్ దూబే తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. శివమ్ దూబే(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్)కు తోడుగా జితేశ్ శర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.