IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. శివమ్ దూబే(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. శివమ్ దూబేకు తోడుగా జితేశ్ శర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసారు.
రోహిత్ డకౌట్..
159 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. సమన్వయ లోపంతో కెప్టెన్ రోహిత్ శర్మ(0) రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. శుభ్‌మన్ గిల్ బౌండరీలతో దూకుడుగా ఆడాడు.
అదే జోరులో ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(23) స్టంపౌట్‌గా వెనుదిగాడు. దాంతో 28 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే, తిలక్ వర్మ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 36 పరుగులే చేసింది.
చెలరేగిన శివమ్ దూబే..
పవర్ ప్లే అనంతరం ఈ ఇద్దరూ ధాటిగా ఆడారు. 44 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన ఈ జోడీని అజ్మతుల్లా ఒమర్జాయ్ విడదీసాడు. తిలక్ వర్మ(26)ను గుల్బాదిన్ నైబ్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మతో శివమ్ దూబే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో భారత్ వేగంగా పరుగులు చేసింది. నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం జితేశ్ శర్మ(31)ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ క్యాచ్ ఔట్ చేశాడు. బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ సాయంతో శివమ్ దూబే 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సిక్స్, ఫోర్ బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.