అఫ్గానిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా పరుగులు చేసిన నబీపై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్.. డబుల్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో టీమిండియా విజయం సాధించింది. అయితే తొలి సూపర్ ఓవర్ అనంతరం మహమ్మద్ నబీ, రోహిత్ శర్మ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖేష్ కుమార్ వేసిన ఈ ఓవర్ చివరి బంతిని ఆడటంలో నబీ విఫలమయ్యాడు.

వెంటనే అతను క్విక్ సింగిల్‌కు ప్రయత్నించగా.. వికెట్ కీపర్ సంజూ శాంసన్ రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతను విసిరిన బంతి నబీ ప్యాడ్స్‌ను తాకి లాంగాన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. దాంతో నబీ మరో రెండు పరుగులు పరుగెత్తాడు. సంప్రదాయం ప్రకారం బంతి బ్యాటర్‌కు తాకినప్పుడు పరుగులు తీయకుండా క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తారు.
కానీ అది సూపర్ ఓవర్ కావడం.. ఉద్దేశపూర్వకంగా బంతికి తాను అడ్డురాలేదనే ఆలోచనతో నబీ అదనంగా రెండు పరుగులు తీసాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ.. నబీతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. విరాట్ కోహ్లీ సైతం అతనికి మద్దతు తెలిపాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో పలుమార్లు రోహిత్ సహనం కోల్పోయాడు.
తాను బ్యాటింగ్ చేసే సమయంలో బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లిన బంతిని బైస్‌గా ప్రకటించడంతో.. ఫీల్డర్ వీరేందర్ శర్మను నవ్వుతూనే నిలదీసాడు. ఆ తర్వాత ఓ నోబాల్ విషయంలోనూ అంపైర్ల నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ముఖేష్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని వైడ్‌గా ప్రకటించడంపై కూడా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. బ్యాటర్‌కు ముందు జరిగాడని, బంతి వైడ్ లైన్ మీదుగా వెళ్లిందని వాదించాడు. అంపైర్లపై రోహిత్ అసహనం వ్యక్తం చేసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/18) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. భారత్ కూడా 16 పరుగులే చేసింది. దాంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేయగా.. అఫ్గాన్ ఒక్క పరుగే చేసి రెండు వికెట్లు పోయింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైన్లు లెక్క.