టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ క్యాచ్ విషయంలో పంత్‌ను రోహిత్ శర్మ మందలించాడు.
కుల్దీప్ యాదవ్ వేసిన 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేవడంతో వికెట్ కీపర్ రిషభ్ పంత్ పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న రోహిత్‌ను క్యాచ్‌కు ప్రయత్నించవద్దని అరిచాడు.

దాంతో రోహిత్'అది నీ క్యాచేరా అయ్యా'అని మందలించాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో వినిపించాయి. క్యాచ్ పట్టిన అనంతరం పంత్.. రోహిత్ శర్మను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) టాప్ స్కోరర్‌గా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్‌దీప్ సింగ్(3/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు.