IND vs AFG: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మకు తోడుగా రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సత్తా చాటాడు.
22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఫరీద్ అహ్మద్ బిగ్ షాకిచ్చాడు. అతను వేసిన మూడో ఓవర్‌లో వరుస బంతుల్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)లను పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్ ఆడే క్రమంలో జైస్వాల్(4) క్యాచ్ ఔటవ్వగా.. మరుసటి బంతికే కోహ్లీ చెత్ షాట్‌తో క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(1)ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే సంజూ శాంసన్(0)ను ఫరీద్ అహ్మద్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 4 వికెట్లకు 30 పరుగులు చేసింది.
క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. అనంతరం అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. రింకూ సింగ్ భారీ సిక్సర్లతో హిట్టింగ్ మొదలుపెట్టగా.. షరఫుద్దీన్ వేసిన 12వ ఓవర్‌లో రోహిత్ వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాది టచ్‌లోకి వచ్చాడు. ఇద్దరూ పోటీ పడీ బౌండరీ బాదడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది. కైస్ అహ్మద్ బౌలింగ్‌లో బౌండరీ బాది 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన 19వ ఓవర్‌లో 6, 4, 4 బాది 64 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ కాగా.. ఈ ఘనతను అందుకున్న తొలి బ్యాటర్‌గా హిట్ మ్యాన్ చరిత్రకెక్కాడు.
ఈ ఓవర్ చివరి బంతిని రింకూ సింగ్ సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్‌లో రోహిత్ శర్మ వరుసగా 4, 6, 6, 1 బాదగా.. రింకూ సింగ్ 6, 6, 6 బాది 36 పరుగులు పిండుకున్నారు.