IND vs AFG: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ నోరుపారేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో శుభ్‌మన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ(0) రనౌట్‌గా వెనుదిరిగాడు. క్విక్ సింగిల్ కోసం రోహిత్ శర్మ పిలుస్తున్నా పట్టించుకోకుండా శుభ్‌మన్ గిల్ క్రీజులోనే ఉండిపోయాడు. అప్పటికే నాన్‌స్ట్రైకర్ వైపు వచ్చిన రోహిత్ శర్మ.. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.
శుభ్‌మన్ గిల్ సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా.. గట్టిగా తిడుతూ నోరు మూయించాడు. ఓపెనర్ల సమన్వయం లోపం కారణంగా టీమిండియా ఒక్క పరుగు కూడా చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని రోహిత్ శర్మ మిడాఫ్ దిశగా షాట్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు.

ఇబ్రహీమ్ జడ్రాన్ సూపర్ డైవ్‌తో బంతిని ఆపాడు. దాంతో నాన్‌స్ట్రైకర్ శుభ్‌మన్ గిల్ పరుగెత్తకుండా ఆగిపోయాడు. కానీ రోహిత్ నాన్‌స్ట్రైకర్ వైపు రాగా.. బంతిని జడ్రాన్ కీపర్‌కు అందించి వికెట్ సాధించాడు.
ఇక పరుగెత్తి ఉంటే ఔటయ్యేవాళ్లం కాదని, పిలుస్తుంటే వినబడటం లేదా?అని శుభ్‌మన్ గిల్‌పై రోహిత్ మండిపడ్డాడు. ఫీల్డర్ ఉన్నది చూసుకోవా? అని గిల్ ఎదురు ప్రశ్నించగా.. రోహిత్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తిట్టుకుంటూ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. డకౌట్‌తో పునరాగమనం చేశాడు. వాస్తవానికి గిల్ వేగంగా పరుగెత్తి ఉంటే రనౌట్ అయ్యేది కాదు. డైవ్ చేసిన ఫీల్డర్ లేచి బంతిని అందుకునేలోపే అతను క్రీజును చేరేవాడు. ఔటవుతాననే భయం.. బ్యాటింగ్ చేయాలనే శుభ్‌మన్ గిల్ స్వార్థం టీమిండియాకు నష్టం చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.