IND vs AFG: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు ముఖేష్ కుమార్(2/33), అక్షర్ పటేల్(2/23) రఫ్ఫాడించారు. దాంతో అఫ్గాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్ శుభారంభం అందించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆచితూచి ఆడారు. దాంతో అఫ్గాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు.
రెహ్మనుల్లా గుర్బాజ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్‌లో ఇబ్రహీమ్ జడ్రాన్‌ను శివమ్ దూబే క్యాచ్ ఔట్ చేశాడు. తన మరుసటి ఓవర్‌లో అక్షర్ పటేల్ రెహ్మత్ షా(3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో అఫ్గాన్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీ.. అజ్మతుల్లా ఒమర్జాయ్(29)తో కలిసి ధాటిగా ఆడాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముఖేశ్ కుమార్ విడదీసాడు. ఒకే ఓవర్‌లో రెహ్మత్ షా(29)తో పాటు మహమ్మద్ నబీని ఔట్ చేశాడు. రెహ్మత్ షాను క్లీన్ బౌల్డ్ చేసిన ముఖేష్ కుమార్.. మహమ్మద్ నబీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన నజిబుల్లా జడ్రాన్(11 నాటౌట్), కరీమ్ జనత్(8 నాటౌట్) జట్టు స్కోర్‌ను 150 ధాటించారు.